ఫుట్‌బాల్‌ మైదానంలో విషాదం.. అందరూ చూస్తుండగానే కబలించిన మృత్యువు

12 Feb, 2024 17:58 IST|Sakshi

ఫుట్‌బాల్‌ మైదానంలో తీవ్ర విషాదం​ చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ ఆటగాడిని మృత్యువు కబలించింది. పిడుగుపాటుకు గురై ఓ ఫుట్‌బాలర్‌ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో జరిగింది. స్థానిక జట్ల మధ్య జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ విషాదం సంభవించింది.

మ్యాచ్‌ జరుగుతుండగా 35 ఏళ్ల ఫుట్‌బాలర్‌పై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా చురుగ్గా కదిలిన సహచరుడు ఒక్కసారిగా నిశ్రేష్ఠుడిగా మారడంతో ఆటగాళ్లలో దుఖం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఏడాదికాలంలో ఇండోనేషియాలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం ఇది రెండోసారి. గతంలో తూర్పు జావాలోని ఓ యువ ఫుట్‌బాలర్‌ ఇలాగే పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగుపాటు కారణంగా ఆ ఫుట్‌బాలర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. క్రీడా మైదానాల్లో ఇలాంటి దుర్ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. 25 సంవత్సరాల క్రితం కాంగోలో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగుతుండగా పిడుగుపడి జట్టు మొత్తం ప్రాణాలు కోల్పోయింది,. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega