Ian Chappell: 45 ఏళ్ల సుదీర్ఘ కామెంట్రీ ప్రస్థానానికి ముగింపు పలికిన ఆసీస్‌ దిగ్గజం 

16 Aug, 2022 07:00 IST|Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ చాపెల్‌ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్‌ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్‌ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్‌ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్‌ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్‌ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్‌ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు.

ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్‌ చాపెల్‌ ఇందులో 30 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సార్లు స్టార్‌ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్‌ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు