Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో!

5 Jul, 2022 13:10 IST|Sakshi

India Vs England 5th Test: టీమిండియా టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రాను నియమించడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ చాపెల్‌ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించాడు. బహుశా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ టెస్టు జట్ల కెప్టెన్ల నియామకాల్ని చూసి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 

కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌(ఐదో) టెస్టుకు ముందు రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడిన నేపథ్యంలో బుమ్రాకు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అదే విధంగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణించాడు. అయితే, నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ పైచేయి సాధించడంతో అంతా తలకిందులైంది.

నిజంగా పెద్ద సాహసమే!
ఇదిలా ఉంటే.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై స్పందించిన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టెస్టు జట్టు కెప్టెన్లుగా ప్యాట్‌ కమిన్స్‌, బెన్‌స్టోక్స్‌ సక్సెస్‌ చూసిన ఇండియా.. ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఇంగ్లండ్‌తో టెస్టుకు సారథిగా నియమించినట్లుంది.

నిజానికి ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. బుమ్రా సమర్థత ఏమిటో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా టెసుట​ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌, ఆసీస్‌ సారథిగా ప్యాట్‌ కమిన్స్‌ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నారని, వాళ్ల సక్సెస్‌ తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదంటూ ప్రశంసించాడు.

చదవండి: Ind Vs Eng: జాతి వివక్ష.. టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..

మరిన్ని వార్తలు