'అతడు అద్భుతమైన ఆటగాడు.. తిరిగి జట్టులోకి వ‌స్తాడ‌ని ఎవ‌రు ఊహించి ఉండ‌రు'

24 May, 2022 17:33 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిం‍దే.  జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారాకి తిరిగి జట్టులో చోటు దక్కింది. కాగా పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో ఆడుతున్న పుజారా 8 ఇన్నింగ్స్‌లలో 720 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో  అద్భుతమైన పునరాగమనం చేసిన పుజారాపై భారత మాజీ  చీఫ్ సెలెక్టర్ ఎంస్‌కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుజారా నిబద్ధత, అంకితభావం కలిగిన ఆటగాడని అతడు కొనియాడాడు.

"పుజారా భారత జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఇది అతడికి  ఆట పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. అతడు మళ్లీ భారత జట్టులోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు. టెస్ట్‌ క్రికెట్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందడానికి అతడు కౌంటీల్లో ఆడాడు. అక్కడ అత్యుత్తమ ప్రదర్శనలు చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కాలి.

అతడు దాదాపు తన కెరీర్‌లో టెస్ట్‌ క్రికెటర్‌గానే ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆటగాడు జట్టులో లేకపోతే.. అద్భుతమైన టెస్ట్‌ క్రికెటర్‌ను కోల్పోతాం. అతడు ఇంగ్లండ్‌ సిరీస్‌లో బాగా రాణించి భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తే.. పుజారా ఖచ్చితంగా మరో రెండేళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను" అని ఎంస్‌కే ప్రసాద్ పేర్కొన్నాడు.

చదవండి: Daniel Vettori: ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..

మరిన్ని వార్తలు