కరోనాతో మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి కన్నుమూత

12 May, 2021 16:13 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఆర్పీ సింగ్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే అతని తండ్రి కరోనా బారీన పడ్డారు. దీంతో తండ్రిని చూసుకోవడానికి ఆర్పీ సింగ్‌ బయోబబుల్‌ను వదిలి బయటికి వచ్చేశాడు.అప్పటి నుంచి తండ్రి సపర్యలు చేస్తూ పక్కనే ఉన్నాడు. కాగా శివప్రసాద్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం మృత్యువాత పడ్డారు.

ఈ విషయాన్ని ఆర్‌పీ సింగ్‌ తన ట్విటర్‌ ద్వారా చెప్పుకొచ్చాడు.' నా తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా. 15 రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఇవాళ మృత్యువాత పడ్డారు. నా తండ్రి లేరనే వార్త నన్ను కుంగదీసినా మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. మా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటూ మీరంతా ఆ దేవుడిని ప్రార్థించాలని కోరుతున్నా. మిస్‌ యూ నాన్న'' అంటూ పేర్కొన్నాడు.

కాగా సోమవారం మరో క్రికెటర్‌ పియూష్‌ చావ్లా తండ్రి కూడా కరోనాతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక 2018లో ఆర్పీ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలో ఆర్పీ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. 

చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్‌.. ఐపీఎల్‌ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు

మరిన్ని వార్తలు