కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్‌

17 Sep, 2022 08:54 IST|Sakshi

గతవారం ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్-2 కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ఎలిజబెత్‌ పార్థివదేహం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉంది. సోమవారం(సెప్టెంబర్‌ 19 వరకు) ఉదయం 6:30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కాగా 72 ఏళ్లు ఇంగ్లండ్‌ను పాలించిన ఎలిజబెత్‌ను కడసారి చూడడం కోసం జనాలు బారులు తీరారు. వారిలో ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాల్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ కూడా ఉన్నాడు.

అయితే అతను కావాలనుకుంటే సెలబ్రిటీ హోదాలో రాణి ఎలిజబెత్‌ను వీఐపీ స్లాట్‌లో డైరెక్ట్‌గా చూడొచ్చు. కానీ బెక్‌హమ్‌ అలా చేయలేదు. ప్రొటోకాల్‌ పాటిస్తూ దాదపు 13 గంటల పాటు సామాన్యులతో కలసి క్యూ లైన్‌లో నిల్చున్న బెక్‌హమ్‌ శుక్రవారం సాయంత్రం క్వీన్‌ ఎలిజబెత్‌కు కడసారి నివాళి అర్పించాడు. బెక్‌హమ్‌ చర్యపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే విషయమై రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బెక్‌హమ్‌ మాట్లాడాడు.

''మనందరం కలిసి రాణి ఎలిజబెత్‌-2ను కడసారి చూడడానికి వచ్చాం.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవాలనుకున్నాం.. ఇలాంటి సమయంలో సెలబ్రిటీ హోదా కన్న ఒక మాములు వ్యక్తిగా చూద్దామనుకున్నా. అందుకే ప్రొటోకాల్‌ పాటిస్తూ 13 గంటల పాటు క్యూలైన్‌లో నిల్చొన్నా. ఇలా చేసినందుకు నాకు బాధ లేదు.. ఎందుకంటే మనం ఒకరిని కడసారి చూసేందుకు వెళుతున్నాం.

అందుకే రాణి దర్శనం కోసం ఎన్ని గంటలైనా సరే నిరీక్షించాలని అనుకున్నా. చివరికి ఆమెకు కడసారి నివాళి అర్పించా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాణి ఎలిజబెత్‌-2 శవపేటికను ఉంచిన వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇప్పటివరకు దాదాపు 750,000 మంది రాణి ఎలిజబెత్‌ను కడసారి చూడడానికి పోటెత్తారు. 

చదవండి: కొంప ముంచిన వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌

మరిన్ని వార్తలు