‘ఇండియా కంటే ఐపీఎల్‌ ఆడటమే ముఖ్యమా?!’

4 Nov, 2020 18:45 IST|Sakshi
టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ముంబై జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(కర్టెసీ: ముంబై ఇండియన్స్‌)

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ వ్యవహారశైలిపై మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ విమర్శలు గుప్పించాడు. జాతీయ జట్టుకు ఆడటం కంటే, ఓ లీగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. అదే విధంగా రోహిత్‌ గాయాన్ని అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న ‘హిట్‌మ్యాన్’‌ రోహిత్‌ శర్మ.. తొడ కండరాల గాయంతో వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన బీసీసీఐ, గాయం కారణంగా అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చినట్లు పేర్కొంది.

అయితే ముంబై ప్రాక్టీస్‌ సెషన్స్‌లో రోహిత్‌ శ్రమిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడం, అదే విధంగా అంతగా ప్రాధాన్యం లేని  మంగళవారం నాటి మ్యాచ్‌ కోసం అతడు బరిలో దిగడం వంటి పరిణామాలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేగాకుండా, మ్యాచ్‌కు ముందు ‘అంతా బాగుంది. నేను ఫిట్‌గా, చురుగ్గా కూడా ఉన్నాను’అంటూ రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంతో ముఖ్యమైన ఆటగాడు, అన్‌ఫిట్‌గా ఉన్నాడని భారత జట్టు ఫిజియో తేల్చిచెప్పిన కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాని క్రికెటర్‌ అయినటువంటి రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌లో ముంబైకి ఆడటమే కాదు, నాయకత్వం కూడా వహిస్తున్న విధానం అతడి ఆసక్తి ఏమిటన్న అంశాలను తేటతెల్లం చేస్తోంది.

ఇండియాకు ఆడటం కంటే ఐపీఎల్‌కే అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడా? జాతీయ జట్టుకు ఆడటం కంటే ఓ క్లబ్‌ తరఫున ఆడటమే ముఖ్యం అని భావిస్తున్నాడా? ఈ విషయంపై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుంది? లేదా రోహిత్‌ గాయాన్ని సరిగ్గా అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’అని పేర్కొన్నాడు. ఇక ఒక్క లీగ్‌ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇప్పటికే రోహిత్‌ శర్మకు సూచించిన విషయం తెలిసిందే. (చదవండి: రోహిత్‌... తొందరపడకు!)

మరిన్ని వార్తలు