విషాదం: ఒకేరోజు అటు రవీందర్‌ పాల్‌... ఇటు కౌశిక్‌

9 May, 2021 04:29 IST|Sakshi

కరోనాతో ఒకే రోజు ఇద్దరు భారత హాకీ మాజీ క్రీడాకారుల కన్నుమూత

1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన జట్టులో ఇద్దరూ సభ్యులు

న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్‌ క్రీడాకారులు తుది శ్వాస విడిచారు. కోవిడ్‌–19కు చికిత్స పొందుతూ కోలుకోలేకపోయిన రవీందర్‌ పాల్‌ సింగ్‌ (61) లక్నోలో... ఎంకే కౌశిక్‌ (66) ఢిల్లీలో కన్ను మూశారు. కౌశిక్‌కు భార్య, ఒక కుమారుడు ఉండగా... రవీందర్‌ పాల్‌ అవివాహితుడు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణపతకం గెలిచింది. రవీందర్‌ పాల్, కౌశిక్‌లు ఈ జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్‌ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్‌ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్‌ శ్రద్ధాంజలి ఘటించారు.  

కౌశిక్‌: ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా కౌశిక్‌ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్‌ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది.  

రవీందర్‌ పాల్‌: 1979 జూనియర్‌ ప్రపంచకప్‌లో సభ్యుడి నుంచి సీనియర్‌ టీమ్‌కు వెళ్లిన రవీందర్‌ పాల్‌ 1984 వరకు సెంటర్‌ హాఫ్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్‌ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్‌లో, రెండు చాంపియన్స్‌ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు.

>
మరిన్ని వార్తలు