భారత మాజీ క్రికెటర్‌ చంద్రశేఖర్‌కు అస్వస్థత

19 Jan, 2021 05:09 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్‌ స్పిన్నర్‌ బి.ఎస్‌. చంద్రశేఖర్‌ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్‌ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్‌ స్ట్రోక్‌గా నిర్ధారించి చికిత్స చేశారు.

మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్‌కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్‌ తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్‌సింగ్‌ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్‌లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది.

మరిన్ని వార్తలు