Unmukt Chand: క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయం.. 

1 Oct, 2022 16:30 IST|Sakshi

భారత్‌ అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్‌ చంద్‌ స్వయంగా తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. ఉన్ముక్త్‌ చంద్‌ షేర్‌ చేసిన ఫోటోలో అతని ఎడమ కన్ను పూర్తిగా ఉబ్బిపోయి కనిపించకుండా పోయింది.

కంటి గాయంపై ఉన్మక్త్‌ చంద్‌ స్పందిస్తూ.. ''అథ్లెట్ అంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. కొన్ని సార్లు మనం విజయంతో తిరిగి వస్తాం, మరికొన్ని రోజులు నిరాశగా, ఓటమి భారాన్ని, గాయాలను ఇంటికి మోసుకురావాల్సి ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి... తృటిలో కన్ను పోయేది... నన్ను విష్ చేసినవారందరికీ థ్యాంక్యూ'' అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇక ఉన్ముక్త్‌ చంద్‌ 2012లో అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టును విజేతగా నిలిపాడు. అతని కెప్టెన్సీలోనే భారత్‌ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే అండర్‌ 19 వరల్డ్‌కప్‌ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్‌ చంద్‌.. చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు అడుగంటడంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్‌ఏకు వలస వెళ్లాడు.

ఉన్ముక్త్‌ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్‌ ప్లంకెట్‌, జుయాన్‌ థెరాన్‌, సమీ అస్లాం తదితరులతో కలిసి యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్.. 2021 సీజన్‌ అమెరికన్‌ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్‌లో సిలికాన్‌ వ్యాలీ స్ట్రైయికర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్‌ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Unmukt Chand: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..!

దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే!

>
మరిన్ని వార్తలు