కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీమిండియా మాజీ కెప్టెన్‌

19 Jan, 2023 18:54 IST|Sakshi

India Under 19 Captain Vijay Zol: భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్‌ జోల్‌, మరో 18 మంది తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో విజయ్‌ జోల్‌, విక్రమ్‌ జోల్‌లను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు సదరు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌పై కూడా ఓ వ్యక్తి (ఈ కేసులో నిందితుల్లో ఒకరు) ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సదరు మేనేజర్ తమను లక్షల మేర మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతనిపై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, 2014లో భారత అండర్‌-19 టీమ్‌ కెప్టెన్‌గా ఎంపికైన 28 ఏళ్ల విజయ్‌ జోల్‌.. మహారాష్ట్ర, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (యూత్‌ కాంట్రాక్ట్‌) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో జరిగిన అండర్‌-19 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో జోల్‌  467 బంతుల్లో 53 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 451 పరుగులు చేశాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా ఉంది. జోల్‌.. 2010 విజయ్‌ మర్చం‍ట్‌ టోర్నీలోనూ డబుల్‌ సెంచరీ స్కోర్‌ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ సహచరుడైన జోల్‌.. అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు రాక దేశవాలీ టోర్నీలకే పరిమితమయ్యాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన జోల్‌.. 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 47.50 సగటున 965 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 200 నాటౌట్‌గా ఉంది.        
 

మరిన్ని వార్తలు