భారత మాజీ క్రికెటర్‌ సదాశివ్‌ పాటిల్‌ మృతి

16 Sep, 2020 06:48 IST|Sakshi

కొల్హాపూర్ ‌: భారత మాజీ క్రికెటర్‌ సదాశివ్‌ రావ్‌జీ (ఎస్‌ఆర్‌) పాటిల్‌ మృతి చెందారు. ఆయనకు 86 ఏళ్లు.  మంగళవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కొల్హాపూర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ అధికారి రమేశ్‌ కదమ్‌ తెలిపారు. మీడియం పేసర్‌ అయిన పాటిల్‌... 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన 79వ ఆటగాడిగా నిలిచిన ఆయన... కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్‌కు పరిమితం అయ్యారు.

పాటిల్‌ మృతిపై స్పందించిన బీసీసీఐ ‘న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్‌ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్లను రాబట్టిన ఆయన... మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్, 27 పరుగులతో గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.’అని పేర్కొంది. అనంతరం లాంక్‌షైర్‌ లీగ్‌లో 1959 నుంచి 1961 వరకు రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ల్లో ఆడి... 111 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1952–64 మధ్య మహారాష్ట్ర తరఫున 36 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 866 పరుగులు చేసిన పాటిల్‌... 83 వికెట్లను నేలకూల్చాడు. రంజీల్లో మహారాష్ట్రకు సారథ్యం కూడా వహించాడు. పాటిల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు