Amartya Chakraborty: యువ స్విమ్మర్‌ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి

21 Apr, 2022 16:09 IST|Sakshi

Former Swimming Champion Amartya Chakraborty Passed Away: మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్‌ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత కొంతకాలంగా వెన్నెముక, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమర్త్య.. బుధవారం ఉదయం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్‌ కావడంతో కన్నుమూశాడు. భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేవని అమర్త్య తండ్రి అమితోష్‌ చక్రవర్తి కన్నీరుమున్నీరవడం అందరినీ కలచి వేసింది. 

కొడుకుని బతికించుకునేందుకు ఉన్నందంతా ఖర్చుచేయడమే కాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని అమితోష్‌ వాపోయాడు. ఆర్ధిక సాయం కోసం కేంద్ర క్రీడా శాఖకు, భారత పారాలింపిక్‌ కమిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అమర్త్య చక్రవర్తి అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట పారా స్విమ్మింగ్‌ ఈవెంట్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. అమర్త్య 2017 పారా నేషనల్స్‌లో ఉత్తమ స్విమ్మర్‌ అవార్డును గెలుచుకున్నాడు.
చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై

మరిన్ని వార్తలు