వారెవ్వా కమిన్స్‌.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు

27 Sep, 2020 12:28 IST|Sakshi
పాట్‌ కమిన్స్‌(కర్టసీ : బీసీసీఐ)

అబుదాబి : పాట్‌ కమిన్స్.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు. రూ. 15 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్‌ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కమిన్స్‌ ఘోరమైన ప్రదర్శన చేశాడు. 3ఓవర్లోనే 16 ఎకానమీ రేటుతో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కమిన్స్‌ ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలా ఆడతాడా.. ఒక అంతర్జాతీయ బౌలర్‌ ఇవ్వాల్సిన ప్రదర్శన ఇది కాదు.. కమిన్స్‌ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడంటూ తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు సంధించారు. అయితే కమిన్స్‌ ఇవేవి పట్టించుకోకుండా తన ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా కమిన్స్‌కు మద్దతు ఇచ్చాడు. (చదవండి : 'ఒక్క డకౌట్‌తో నేనేం చెడ్డవాడిని కాను')

కమిన్స్‌ తానేంతో విలువైన ఆటగాడినో సన్‌రైజర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనే నిరూపించాడు.  ఈసారి పూర్తి కోటా ఓవర్లు వేసిన కమిన్స్‌ మొత్తం 4ఓవర్లలో ఒక వికెట్‌ ఇచ్చి 19 పరుగులు ఇచ్చాడు. కమిన్స్‌ తన ప్రతీ డెలివరీని దాదాపు 140కిమీ వేగంతో అద్భుతంగా సందించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టోను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తీరు చూస్తే ప్రపంచ నెంబర్‌ వన్‌ బౌలర్‌ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. నిజానికి గత మ్యాచ్‌లో కమిన్స్‌ ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కెప్టెన్‌ కార్తీక్‌ కమిన్స్‌ మీద ఉన్న నమ్మకంతో ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రదర్శనతో అదరగొట్టాడు. ​కమిన్స్‌ ప్రదర్శనతో ముంబైతో మ్యాచ్‌లో తిట్టినవారే ఇప్పుడు వారెవ్వా కమిన్స్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి :కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!)

ఈ నేపథ్యంలో కమిన్స్‌ ప్రదర్శనపై ఆసీస్‌ మాజీ స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ పలు విషయాలు వెల్లడించాడు.' కమిన్స్‌ ఎంత విలువైన ఆటగాడో ఇప్పుడు అర్థమయి ఉంటుంది. 15 కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు రానున్న మ్యాచ్‌ల్లో అతను డబుల్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఖాయం. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో కమిన్స్‌ వేసిన ప్రతీ డెలివరీ అద్భుతమే అని చెప్పాలి. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా లయ తప్పిన బౌలింగ్‌తో కనిపించిన అతను సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో పాత కమిన్స్‌ను చూపెట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వికెట్‌ తీయడంలో కమిన్స్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని రానున్న మ్యాచ్‌ల్లో చూడబోతున్నాం. అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : కమిన్స్‌ విఫలం వెనుక కారణం ఇదే) 

న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ కూడా కమిన్స్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ' కమిన్స్‌ నిజంగా ఒక క్లాస్‌ ప్లేయర్‌. తనను విమర్శించిన వారికి ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు. కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు న్యాయం చేశాడు. అతను ఫాంలోకి వచ్చాడంటే అవతలి బ్యాట్స్‌మెన్లకు ఇక చుక్కలే.. రానున్న మ్యాచ్‌ల్లో కమిన్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముంబైతో మ్యాచ్‌లో మూడో బౌలర్‌గా బరిలోకి దిగిన కమిన్స్‌ను ఈ మ్యాచ్‌లో మాత్రం ఓపెనింగ్‌ బౌలర్‌గా దించి కార్తీక్‌ మంచి పనిచేశాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో అతను వేసిన ప్రతీ బంతి వికెట్ల మీదుగానే వెళ్లింది. కమిన్స్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో అవుటైన తీరు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుందని' తెలిపాడు. కాగా కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30(బుధవారం) రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు