Rudi Koertzen Death: క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ అంపైర్‌ దుర్మరణం

9 Aug, 2022 17:33 IST|Sakshi

క్రికెట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్‌ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు. మంగళవారం మధ్యాహ్నం సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్‌ కోర్స్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా 1981లో కోర్ట్జెన్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1992లో ఐసీసీ కోర్ట్జెన్‌ను ఫుల్‌టైం అంపైర్‌గా నియమించింది.

1992లో సౌతాఫ్రికా- భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు తొలిసారి అంపైరింగ్‌ అవకాశం వచ్చింది. అంతేకాదు కోర్ట్జెన్‌ చేసిన మెయిడెన్‌ అంపైరింగ్‌ మ్యాచ్‌లో బ్యాటర్‌ రనౌట్‌కు సంబంధించిన తొలిసారి టెలివిజన్‌ రీప్లే ప్రవేశపెట్టారు. ఇక 43 ఏళ్ల వయసులో పోర్ట్‌ ఎలిజిబెత్‌ వేదికగా జరిగిన టెస్టులో తొలిసారి ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించారు.  అక్కడి నుంచి కోర్ట్జేన్‌ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దాదాపు 100 టెస్టులు, 200 వన్డేలకు కోర్ట్జెన్‌ అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. 2003, 2007 వరల్డ్‌కప్స్‌లో కోర్ట్జెన్‌ థర్డ్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు.

ఇక రూడీ కోర్ట్జెన్‌ 2010లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌కు చివరిసారి అంపైరింగ్‌ చేశాడు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు  ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా  చేతిని  పైకెత్తుతూ ఆయన  ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్‌ ఫ్యాన్స్‌ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని  ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు.

రూడి కోర్ట్జెన్‌ కుమారుడు జూనియర్‌ కోర్ట్జెన్‌ మాట్లాడుతూ.. ''ప్రతీ వారాంతంలో గోల్ఫ్ ఆడిన తర్వాత కేప్ టౌన్ నుండి నెల్సన్ మండేలా బేలోని డెస్పాచ్ వద్ద వెళ్లడం నాన్నకు అలవాటు. వాస్తవానికి సోమవారమే ఆయన ఇంటికి రావాలి. కానీ గోల్ఫ్‌లో మరొక రౌండ్‌ ఆడాలన్న ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. ఇంటికి తిరిగి వస్తారని సంతోషంలో ఉన్న మాకు ఆయన మరణవార్త కలచివేసింది అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

రూడీ కోర్ట్జెన్‌ మృతి పట్ల ఐసీసీ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళి ప్రకటించారు. కాగా రూడీ కోర్ట్జెన్‌ మరణవార్త తెలుసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు మంగళవారం ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనుంది.

చదవండి: Hundred 2022: ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు

మరిన్ని వార్తలు