Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్‌

15 Apr, 2022 19:52 IST|Sakshi

శ్రీలంక మాజీ క్రికెటర్‌ దమ్మిక ప్రసాద్‌ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్‌ తెలిపాడు.

''బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని'' మీడియాకు తెలిపాడు. అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్‌ తన నిరసనను వ్యక్తం చేశాడు. 

కాగా 2019లో ఈస్టర్‌ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు పోయాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు. దీంతోపాటు బాంబు దాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందించలేదు.

చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్‌ ముఖ్యమా.. వదిలి రండి!

మరిన్ని వార్తలు