Lando Norris In Formula 1 Race: నోరిస్‌ తొలిసారి...

26 Sep, 2021 12:01 IST|Sakshi

సోచి (రష్యా): ఈ ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో 14 రేసులు జరగ్గా... నలుగురు డ్రైవర్లలో (వెర్‌స్టాపెన్, హామిల్టన్, బొటాస్, లెక్‌లెర్క్‌) ఎవరో ఒకరికి మాత్రమే ‘పోల్‌ పొజిషన్‌’ దక్కుతూ వచ్చింది. అయితే సీజన్‌ 15వ రేసు రష్యా గ్రాండ్‌ప్రిలో మాత్రం ఈ నలుగురిని వెనక్కినెట్టి లాండో నోరిస్‌ రూపంలో కొత్త డ్రైవర్‌ ‘పోల్‌ పొజిషన్‌’ను సంపాదించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మెక్‌లారెన్‌ జట్టుకు చెందిన 21 ఏళ్ల లాండో నోరిస్‌ (బ్రిటన్‌) ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. 

నోరిస్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.993 సెకన్లలో ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) రెండో స్థానం నుంచి... జార్జి రసెల్‌ (విలియమ్స్‌) మూడో స్థానం నుంచి... హామిల్టన్‌ (మెర్సిడెస్‌) నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్‌లో ఎనిమిది రేసుల్లో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ ఆదివారం జరిగే రేసును చివరిదైన 20వ స్థానం నుంచి మొదలుపెడతాడు. 

నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మరిన్ని వార్తలు