Karim Benzema: శకం ముగిసింది.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

20 Dec, 2022 11:02 IST|Sakshi

ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫ్రాన్స్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ కరీమ్‌ బెంజెమా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోమవారం రాత్రి తన ట్విటర్‌లో బెంజెమా రిటైర్మెంట్‌ విషయాన్ని పేర్కొన్నాడు. ఆదివారం ఖతర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ పెనాల్టీ షూటౌట్‌లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా బెంజెమా తన ట్విటర్‌లో స్పందించాడు.

''ఫ్రాన్స్‌ ఓటమి నన్ను బాధించింది.. ఫిట్‌నెస్‌, ఇతర కారణాల రిత్యా అంతర్జాతీయ కెరీర్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.. ఇన్నాళ్లు ఫ్రాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. నాపై ప్రేమను చూపించిన అభిమానులందరికి కృతజ‍్క్షతలు. ఫిఫా వరల్డ్‌కప్‌ లేకుండానే రిటైర్మెంట్‌ ఇవ్వడం బాధ కలిగిస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు.. అందుకే గుడ్‌బై చెప్పేశా'' అంటూ పేర్కొన్నాడు. 

బెంజెమా సోమవారమే తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇలా పుట్టినరోజు నాడే రిటైర్మెంట్‌ ప్రకటించి తన అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 2007లో ఫ్రాన్స్‌ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన బెంజెమా 97మ్యాచుల్లో 37గోల్స్‌ కొట్టాడు.2015లో సెక్స్‌-టేప్‌ కేసులో బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు ఋజువు కావడంతో ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య బెంజెమాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2021లో తిరిగి పునారాగమనం చేసిన బెంజెమా యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రి క్వార్టర్స్‌లో ఏకంగా నాలుగు గోల్స్‌ కొట్టి ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయాడు.

ఈ ప్రపంచకప్‌లో కరీమ్‌ బెంజెమా తన మాయ చూపిస్తాడని అంతా భావించారు. కానీ  ఫిఫా ప్రపంచకప్ ఆరంభానికి ముందే తొడ కండరాల గాయంతో బాధపడుతూ కరీమ్‌ బెంజెమా జట్టుకు దూరమయ్యాడు. అలా‌ ఫ్రాన్స్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కరీమ్‌ బెంజెమా ఫిఫా వరల్డ్‌కప్‌ లేకుండానే తన కెరీర్‌ను ముగించాడు. ఇక ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరీమ్‌ బెంజెమా ప్రతిష్టాత్మక బాలన్‌ డీ ఓర్‌(Ballon D'Or) అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె

మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?

మరిన్ని వార్తలు