FIFA WC 2022: డిఫెండింగ్‌ చాంపియన్‌కు బిగ్‌ షాక్‌.. కరీమ్‌ బెంజెమా దూరం

20 Nov, 2022 08:52 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఆరంభానికి ముందే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు స్టార్‌ ఆటగాళ్లు పాల్‌ పోగ్బా, కాంటే, కుంకూలు గాయాలతో సాకర్‌ సమరానికి దూరమయ్యారు. తాజాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక బాలన్‌ డీ ఓర్‌ అవార్డు విజేత కరీమ్‌ బెంజెమా గాయంతో ఫిఫా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు.

34 ఏళ్ల కరీమ్‌ బెంజెమా ఎడమ తొడ గాయంతో బాధపడుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించించి. అసలు సమరానికి ముందు శనివారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గంట పాటు మైదానంలో ఉన్న బెంజెమా చాలా  ఇబ్బందిగా కదిలడంతో వైద్యలు అతన్ని పరీక్షించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని పేర్కొనడంతో బెంజెమా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బెంజెమా దూరమవడం ఫ్రాన్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. గతేడాది కాలంగా అతను సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. బాలన్‌ డీ ఓర్‌ విజేత అయిన కరీమ్‌ బెంజెమా రియల్‌ మాడ్రిడ్‌ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్‌ సాధించడం విశేషం.

ఇక గ్రూప్‌-డిలో ఉన్న ఫ్రాన్స్‌ మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనున్న ఫ్రాన్స్‌ .. ఆ తర్వాత డెన్మార్క్‌, ట్యూనిషియాలను ఎదుర్కోనుంది. 1962లో బ్రెజిల్‌ వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను నిలుపుకుంది. అప్పటినుంచి ఏ జట్టు కూడా వరుసగా రెండోసారి చాంపియన్‌ అవలేకపోయింది. తాజాగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్‌ 1962 సీన్‌ను రిపీట్‌ చేస్తుందో లేదో చూడాలి.

చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్‌

FIFA: సాకర్‌ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే

మరిన్ని వార్తలు