FIFA WC 2022: 'అన్న కోసమే ఆడుతున్నా.. కప్‌ కొట్టాల్సిందే'

15 Dec, 2022 13:10 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్‌ దర్జాగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్‌ 18న అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను నిలుపుకోవాలని ఫ్రాన్స్‌ భావిస్తోంది.

అయితే మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్‌ సూపర్‌స్టార్‌ కైలియన్‌ ఎంబాపె మెరవనప్పటికి తామున్నామంటూ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. వారిలో ఒకడు తియో హెర్నాండేజ్‌ అయితే.. ఇంకొకడు రాండల్‌ కొలో మునాయ్‌. ఆట 5వ నిమిషంలో హెర్నాండేజ్‌ గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్తే.. రెండో అర్థభాగంలో ఆట 79వ నిమిషంలో రాండల్‌ మరో గోల్‌ కొట్టి 2-0తో ఫ్రాన్స్‌ విజయాన్ని ఖాయం చేశాడు. రాండల్‌ సంగతి పక్కనబెడితే.. ఆట ఆరంభంలోనే గోల్‌తో మెరిసిన తియో హెర్నాండేజ్‌ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.

అదేంటంటే.. తియో హెర్నాండేజ్‌ ఎవరో కాదు.. ఫ్రాన్స్‌ స్టార్‌ లుకాస్‌ ఫెర్నాండేజ్‌ సొంత తమ్ముడు. అన్నదమ్ములిద్దరు ఏకకాలంలో ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.అయితే గ్రూప్‌ దశలో ఫ్రాన్స్‌ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కానీ ఆట ఆరంభమైన కాసేపటికే లుకాస్‌ ఫెర్నాండేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం వీడిన లుకాస్‌ ఇప్పటి వరకు తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు పూర్తిగా దూరమైనట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. అన్న దూరం కావడం తియో హెర్నాండేజ్‌ను బాధించింది. ఎలాగైనా అన్న కోసం కప్‌ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌ ఆడినప్పటికి హెర్నాండేజ్‌కు గోల్‌ కొట్టే అవకాశం రాలేదు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. మొరాకోతో కీలకమైన సెమీఫైనల్లో తియో హెర్నాండేజ్‌ గోల్‌ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఇక అన్న లుకాస్‌ హెర్నాండేజ్‌ కల నిజం చేసేందుకు తియో హెర్నాండేజ్‌ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను గెలిపించి అన్నకు టైటిల్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. మొరాకోపై గెలుపు అనంతరం తియో హెర్నాండేజ్‌ మీడియాతో మాట్లాడాడు.

''లూలూ(లుకాస్‌ హెర్నాండేజ్‌).. ఈసారి వరల్డ్‌కప్‌ మనిద్దరి కోసం ఆడుతున్నా. మొరాకోతో మ్యాచ్‌లో గోల్‌ కొట్టగానే కోచ్‌ నన్ను పిలిచి మీ అన్న లుకాస్‌ నిన్ను అభినందించినట్లు చెప్పమని పేర్కొనడం సంతోషం కలిగించింది. నా ప్రదర్శన పట్ల లుకాస్‌ గర్వపడుతున్నాడు. ఆటలో నువ్వు లేకపోవచ్చు.. కానీ ఎప్పుడు నాతోనే ఉండాలని ఆశపడుతున్నా. నీ గాయం నాకు కష్టంగా అనిపిస్తున్నప్పటికి తప్పదు. అన్న కోసం కప్‌ గెలవాలనుకుంటున్నా. మ్యాచ్‌ ముగిసిన ప్రతీరోజు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'

మరిన్ని వార్తలు