ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు పరాభవం

24 May, 2022 07:54 IST|Sakshi

రెండో సీడ్‌ క్రిచికోవాకు షాక్‌ 

తొలి రౌండ్‌లోనే ఓడిన మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్బరా క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ 97వ ర్యాంకర్, 19 ఏళ్ల ఫ్రాన్స్‌ అమ్మాయి డియాన్‌ పారీ 1–6, 6–2, 6–3తో క్రిచికోవాపై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ ఓటమితో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన మూడో డిఫెండింగ్‌ చాంపియన్‌గా క్రిచికోవా నిలిచింది. గతంలో అనస్తాసియా మిస్కినా (రష్యా–2005), ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా–2019) మాత్రమే టైటిల్‌ సాధించిన తర్వాత ఏడాది తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.

మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 38వ ర్యాంకర్‌ నయోమి ఒసాకా (జపాన్‌) కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 28వ ర్యాంకర్‌ అనిసిమోవా (అమెరికా) 7–5, 6–4తో మూడు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత నయోమి ఒసాకాను ఓడించింది.  టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–2, 6–0తో సురెంకో (ఉక్రెయిన్‌)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో 13 సార్లు చాంపియన్‌ నాదల్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్‌లో 6–2, 6–2, 6–2తో థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 2015 విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–2, 3–6, 6–7 (2/7), 3–6తో ముటెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. 

మరిన్ని వార్తలు