French Open 2022: తిరుగు లేని స్వియాటెక్‌

3 Jun, 2022 05:08 IST|Sakshi

వరుసగా 34వ విజయంతో ఫైనల్‌కు

రేపు కోకో గౌఫ్‌తో టైటిల్‌ పోరు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

పారిస్‌: జోరుమీదున్న పోలాండ్‌ ‘టాప్‌’స్టార్‌ ఇగా స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్‌ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్‌ దరియా కసత్‌కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్‌ గారోస్‌లో 2020లో టైటిల్‌ సాధించిన స్వియాటెక్‌ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన 18వ సీడ్‌ కోకో గౌఫ్‌ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్‌ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో గౌఫ్‌తో స్వియాటెక్‌ తలపడనుంది.  

ప్రపంచ నంబర్‌వన్‌ దెబ్బకు...
టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ ధాటికి రష్యన్‌ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్‌ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్‌ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్‌ చేసి కసత్‌కినా షాకిచ్చింది. నాలుగో గేమ్‌ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ దూకుడు పెంచింది. ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది.

వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది.  తొలిసెట్‌ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్‌లో స్వియాటెక్‌ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్‌ ప్లేయర్‌ రెండో గేమ్‌లో మాత్రమే తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్‌ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్‌కే పరిమితమైన కసత్‌కినా 24 అనవసర తప్పిదాలు చేసింది.

తొలిసారి సెమీస్‌లో సిలిచ్‌
మారిన్‌ సిలిచ్‌ తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్‌ గర్జించింది. పురుషుల క్వార్టర్‌ ఫైనల్లో 20వ సీడ్‌ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్‌ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్‌ గారోస్‌ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్‌ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన సిలిచ్‌ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్‌స్లామ్‌ సహా పలు మేజర్‌ టోర్నీల్లో సీడెడ్‌ ప్లేయర్‌గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.  

పోరాడి ఓడిన బోపన్న జోడీ
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్‌ మార్సెలో అరివలో (సాల్వేడార్‌)–జీన్‌ జులియెన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్‌ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్‌–డచ్‌ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు.

2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్‌ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్‌ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్‌ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్‌ హక్‌ ఖురేషీ (పాకిస్తాన్‌)తో కలిసి 2010 యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

నేడు పురుషుల సెమీ ఫైనల్‌
రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) X అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)
కాస్పర్‌ రూడ్‌ (నార్వే) Xమారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)  

సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు