French Open 2023: గార్సియాకు షాక్‌

1 Jun, 2023 02:16 IST|Sakshi
గార్సియా, బ్లింకోవా

రెండో రౌండ్‌లోనే ఓడిన ఫ్రాన్స్‌ స్టార్‌

మాజీ విజేత ఒస్టాపెంకో కూడా ఇంటిదారి  

పారిస్‌: మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన కరోలిన్‌ గార్సియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఈ ఫ్రాన్స్‌ స్టార్‌ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్‌ గార్సియా 6–4, 3–6, 5–7తో ప్రపంచ 56వ ర్యాంకర్‌ అనా బ్లింకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో గార్సియా ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి రెండోసారి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది.

2017 చాంపియన్, 17వ ర్యాంకర్‌ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఒస్టాపెంకో 3–6, 6–1, 2–6తో పేటన్‌ స్టెర్న్స్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 7–5, 6–2తో ఇరీనా షిమనోవిచ్‌ (బెలారస్‌)పై, తొమ్మిదో సీడ్‌ కసత్‌కినా (రష్యా) 6–3, 6–4తో వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌) 2–6, 6–3, 6–1తో స్టార్మ్‌ హంటర్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. మూడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి సెట్‌ను 6–2తో గెల్చుకున్నాక ఆమె ప్రత్యర్థి కామిల్లా జియార్జి (ఇటలీ) గాయం కారణంగా వైదొలిగింది.  

అల్‌కరాజ్‌ ముందుకు...
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. అల్‌కరాజ్‌ 6–1, 3–6, 6–1, 6–2తో టారో డానియల్‌ (జపాన్‌)పై, సిట్సిపాస్‌ 6–3, 7–6 (7/4), 6–2తో కార్బెలాస్‌ బేనా (స్పెయిన్‌)పై, ఖచనోవ్‌ 6–3, 6–4, 6–2తో రాడూ అల్బోట్‌ (మాల్డొవా)పై గెలిచారు. 2015
చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 4 గంటల 38 నిమిషాల పోరులో 6–3, 5–7, 3–6, 7–6 (7/4), 3–6తో కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా) చేతిలో
ఓడిపోయాడు.

మరిన్ని వార్తలు