French Open 2023: మట్టి కోర్టులో మహా సంగ్రామం షురూ

28 May, 2023 08:40 IST|Sakshi

పారిస్‌: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ నేడు మొదలుకానుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో స్పెయిన్‌ దిగ్గజం, 14 సార్లు చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ తుంటి గాయం కారణంగా ఈ టోర్నీకి తొలిసారి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), సెర్బియా దిగ్గజం జొకోవిచ్, నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌) టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్నారు.

నేడు జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో జిరీ వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌)తో సిట్సిపాస్, లాస్లో జెరి (సెర్బియా)తో ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్వియాటెక్‌కు రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), ఐదో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌), ఆరో సీడ్, గత ఏడాది రన్నరప్‌ కోకో గాఫ్‌ (అమెరికా) ఏడో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా), ఎనిమిదో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి రోహన్‌ బోపన్న, యూకీ బాంబ్రీ, సాకేత్‌ మైనేని బరిలోకి దిగనున్నారు.    

మరిన్ని వార్తలు