ఫ్రెంచ్ ఓపెన్‌పై కరోనా పంజా.. ఇద్దరు స్టార్‌ ప్లేయర్స్‌కు పాజిటివ్‌ 

3 Jun, 2021 16:50 IST|Sakshi

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 టెన్నిస్‌ టోర్నీపై క‌రోనా వైర‌స్ పంజా విసిరింది. అత్యంత కఠిన నిబంధనల నడుమ సాగుతున్న ఈ టోర్నీలో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డట్టు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో పాల్గొంటున్న టాప్‌ సీడ్‌ క్రొయేషియా ఆటగాళ్లు నికోలా మెక్టిక్‌, మేట్ పావిక్‌లకు కరోనా సోకడంతో ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌టీ) వారిని క్వారంటైన్‌కు తరలించింది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో స్పెయిన్‌కు చెందిన మరో పురుషుల డబుల్స్‌ జోడీ జామే మునార్, ఫెలిసియానో లోపెజ్ లు మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు అదృశ్యమయ్యారు. వీరిలో కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో నిర్వాహకులకు సమాచారం ఇవ్వకుండా టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగారని తెలుస్తోంది. దీంతో వీరి పేర్లను కూడా డ్రా నుంచి తొలగించారు. 

ఇదిలా ఉంటే ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లతో పాటు స్టాఫ్‌ మెంబర్స్‌ బయో బబుల్‌లోనే గడుపుతున్నారు. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ ఇప్పటివరకు దాదాపు 3000 పరీక్షలు నిర్వహించింది. అయినప్పటికీ కేసులు క్రమంగా బయట పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పారిస్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం అర్థరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మహిళల ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణి నయోమీ ఒసాకా తొలి మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశానికి హాజరుకానందున ఆమెకు జరిమానా విధించడంతో ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదవండి: గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డు బ్రేక్‌..

మరిన్ని వార్తలు