సింధు శుభారంభం

28 Oct, 2021 05:31 IST|Sakshi

పోరాడి ఓడిన శ్రీకాంత్‌

సైనా, కశ్యప్, ప్రణయ్‌ ఇంటిముఖం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్‌ గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ, లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.

 మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్‌ జాకబ్సన్‌ (డెన్మార్క్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. సయాకా తకహాషి (జపాన్‌)తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది.

ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటో (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్‌కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్‌ 17–21, 21–17, 11–21తో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో... ప్రణయ్‌ 11–21, 14–21తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్‌ 21–10, 21–16తో ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌ (ఐర్లాండ్‌)పై, సౌరభ్‌ వర్మ 22–20, 21–19తో వైగోర్‌ కొహెలో (బ్రెజిల్‌)పై గెలిచారు.  

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 21–19, 21–15తో మథియాస్‌ థైరి–మై సురో (డెన్మార్క్‌) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 16–21, 17–21తో టాప్‌ సీడ్‌ లీ సోహీ–షిన్‌ సెయుంగ్‌చన్‌ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్‌–యాంగ్‌ సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించింది.

మరిన్ని వార్తలు