French Open: వీరోచిత పోరాటంతో...

9 Jun, 2021 00:52 IST|Sakshi

కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన జిదాన్‌సెక్, పావ్లుచెంకోవా

మూడు సెట్‌ల హోరాహోరీ పోరులో అద్భుత విజయం

ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో క్వార్టర్‌ ఫైనల్‌ మెట్టుపై బోల్తా పడిన రష్యా సీనియర్‌ ప్లేయర్‌ పావ్లుచెంకోవా... గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఏనాడూ రెండో రౌండ్‌ దాటి ఎరుగని స్లొవేనియా అమ్మాయి తామర జిదాన్‌సెక్‌... అసమాన ఆటతీరును ప్రదర్శంచి తమ కలను నిజం చేసుకున్నారు. తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లో జిదాన్‌సెక్‌ 2 గంటల 26 నిమిషాల్లో పౌలా బదోసపై... పావ్లుచెంకోవా 2 గంటల 33 నిమిషాల్లో ఇలెనా రిబాకినాపై పైచేయి సాధించి గురువారం జరిగే సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు.

పారిస్‌: ఒకవైపు అపార అనుభవజ్ఞురాలు... మరోవైపు అంతగా అనుభవంలేని అమ్మాయి... ఒకేరోజు తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. తుదికంటా పోరాడితే అనుకున్న ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు. ఆ ఇద్దరే అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా), తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా). ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో మంగళవారం ఈ ఇద్దరూ కళ్లు చెదిరే ఆటతో అందరి మనసులు గెల్చుకున్నారు. 31వ సీడ్, పావ్లుచెంకోవా 6–7 (2/7), 6–2, 9–7తో 21వ సీడ్‌ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్‌)పై... అన్‌సీడెడ్‌ జిదాన్‌సెక్‌ 7–5, 4–6, 8–6తో 33వ సీడ్‌ పౌలా బదోస (స్పెయిన్‌)పై విజయం సాధించి సెమీఫైనల్‌ చేరుకున్నారు. వీరిద్దరి కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌ కావడం విశేషం. పావ్లుచెంకోవా గతంలో ఆరుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ మెట్టుపై బోల్తా పడి ఏడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించింది. నేడు జరిగే మరో రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌లో అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌తో క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌); డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌)తో మరియా సాకరి (గ్రీస్‌) తలపడతారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌ 6–3, 6–4తో మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై గెలిచింది.  


బ్రేక్‌ పాయింట్లు కాపాడుకొని... 
బదోసతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 85వ ర్యాంకర్‌ జిదాన్‌సెక్‌ కీలకదశలో అద్భుతంగా ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. తొలి సెట్‌లో ఒకదశలో 0–3తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని సెట్‌ను నెగ్గిన జిదాన్‌సెక్‌ రెండో సెట్‌లో 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఆమె అనూహ్యంగా తడబడి బదోసాకు వరుసగా నాలుగు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సమర్పించుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 6–6 వద్ద తన సర్వీస్‌లో 15–40తో రెండు బ్రేక్‌ పాయింట్లు కాచుకున్న జిదాన్‌సెక్‌ వరుసగా రెండు కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లతో 40–40తో ‘డ్యూస్‌’ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం బదోస సర్వీస్‌ను కూడా బ్రేక్‌ చేసి జిదాన్‌సెక్‌ సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లో సెమీఫైనల్‌ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్‌ మొత్తంలో నెట్‌ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు నెగ్గిన జిదాన్‌సెక్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసింది. 


అనుభవం కలిసొచ్చింది... 
రిబాకినాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పావ్లుచెంకోవా నెమ్మదిగా మ్యాచ్‌పై పట్టు సంపాదించింది. తొలి సెట్‌లో 1–4తో వెనుకబడినా... ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్‌లో రిబాకినా పైచేయి సాధించింది. రెండో సెట్‌లో పావ్లుచెంకోవా ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో రిబాకినా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 6–2తో సెట్‌ను దక్కించుకుంది. కెరీర్‌లో ఆడిన ఏడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడో రౌండ్‌ దాటి ఎరుగని రిబాకినా... 51 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లు ఆడిన అనుభవమున్న పావ్లుచెంకోవా ప్రతి పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు అనుభవజ్ఞురాలైన పావ్లుచెంకోవా తన ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని దక్కించుకుంది.  


జ్వెరెవ్‌ తొలిసారి సెమీస్‌లో... 
పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–1, 6–1తో ఫోకినా (స్పెయిన్‌)పై నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు