Praggnanandhaa: కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ విజేత మాత్రం అతడే!

22 Aug, 2022 11:42 IST|Sakshi

మయామి: ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించాడు. సోమవారం నాటి బ్లిట్జ్‌ టై బ్రేకర్‌లో విజయం సాధించాడు. అయితే, ఓవరాల్‌గా టాప్‌ స్కోరు సాధించిన  కార్ల్‌సన్‌ టోర్నీ విజేతగా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇక అంతకు ముందు పోలాండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాన్‌ క్రిస్టాఫ్‌ డూడాతో జరిగిన ఆరో రౌండ్‌ మ్యాచ్‌లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2–4తో ఓడిపోయాడు. నిర్ణీత నాలుగు ర్యాపిడ్‌ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు రెండు బ్లిట్జ్‌ గేమ్‌లను నిర్వహించగా... రెండింటిలోనూ డూడా గెలుపొందాడు.

ఈ క్రమంలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్‌ తర్వాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే) 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచారు. అయితే, చివరిదైన ఏడో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిప్పటికీ ఓవరాల్‌గా పాయింట్ల పరంగా వెనుకబడ్డ ప్రజ్ఞానందకు నిరాశ తప్పలేదు. కాగా గత ఆర్నెళ్ల కాలంలో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను ఓడించడం ఇది మూడో సారి కావడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తలు
మెద్వెదెవ్‌కు చుక్కెదురు
సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ మెద్వెదెవ్‌ (రష్యా) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7–6 (8/6), 3–6, 6–3తో టాప్‌ సీడ్‌ మెద్వెదెవ్‌ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు.

టైటిల్‌ కోసం ప్రపంచ 152వ ర్యాంకర్‌ బోర్నా చొరిచ్‌ (క్రొయేషియా)తో సిట్సిపాస్‌ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో చొరిచ్‌ 6–3, 6–4తో తొమ్మిదో ర్యాంకర్‌ కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై గెలుపొందాడు.

కాంస్యం కోసం భారత్‌ పోరు 
టెహ్రాన్‌: ఆసియా అండర్‌–18 పురుషుల వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 15–25, 19–25, 18–25తో ఆతిథ్య ఇరాన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్‌ ఆడుతుంది.

తొలి సెమీఫైనల్లో జపాన్‌ 37–39, 25–22, 25–21, 25–14తో కొరియాను ఓడించి నేడు ఇరాన్‌తో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.    
చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్‌ మిస్‌! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. 

మరిన్ని వార్తలు