‘కోహ్లి.. ఇకనైనా జట్టు ఎలా ఉండాలో తెలుసుకో’

14 Sep, 2020 13:48 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. త్వరలో యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఆరంభం కానున్న తరుణంలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి గంభీర్‌ చురకలంటించాడు. అసలు తన అత్యుత్తమ ఎలెవన్‌ జట్టు ఎలా ఉండాలో కోహ్లి తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయంటూ సెటైర్‌ వేశాడు. తాను ఆర్సీబీతో హ్యాపీగా ఉన్నానంటూ పదే పదే ప్రకటించే కోహ్లి.. తుది జట్టులోని పదకొండు మంది ఆటగాళ్ల గురించి ఎప్పుడైనా కసరత్తు చేశాడా అని ప్రశ్నించాడు.  కోహ్లికి జట్టు ఎంపికపై పెద్దగా అవగాహన లేదన్నాడు. కేవలం ఆర్సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనే కోహ్లి ఎప్పుడూ భావిస్తాడన్నాడు. (చదవండి: ఆర్సీబీ.. ఈ జట్టుతో ఎలా నెట్టుకొస్తారు?)

స్టార్‌ స్పోర్ట్స్‌ కనెక్టడ్‌ షోలో ఎంఎస్‌ ధోని-కోహ్లి కెప్టెన్సీల్లో తేడాను గంభీర్‌ విశ్లేషించాడు. ఈ క్రమంలోనే కోహ్లి కెప్టెన్సీని వేలెత్తిచూపాడు. ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుందని, కోహ్లి కెప్టెన్సీలోని ఆర్సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను చేంజ్‌ చేస్తూ ముందుకు వెళుతుందన్నాడు. ఇదే ధోని-కోహ్లి కెప్టెన్సీల్లో ప్రధాన తేడా అన్నాడు. అటు సీఎస్‌కే సక్సెస్‌ కావడానికి, ఆర్సీబీ వైఫల్యం చెందడానికి కూడా కారణం ఇదేనని గంభీర్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రికెటర్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుందన్నాడు. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉండి నిలకడ కోసం ప్రయత్నించాలన్నాడు. ఒకవేళ ఆర్సీబీతో కోహ్లి సంతోషంగా ఉంటే ఇప్పటికే జట్టు ప్రణాళికపై ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నాడు. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌ తన బెస్ట్‌ ఎలెవన్‌ ఏమిటో కోహ్లి తెలుసుకోవడంలో విఫలయమ్యాడన్నాడు. ఈ టోర్నీలోనైనా తుది జట్టు కూర్పు గురించి కచ్చితమైన ప్లానింగ్‌తో బరిలోకి దిగాలన్నాడు.(చదవండి: ‘ఆ ఫాస్ట్‌ బౌలర్‌పైనే ధోని ఆశలు’)

>
మరిన్ని వార్తలు