BGT 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్‌

22 Feb, 2023 12:22 IST|Sakshi
కోహ్లి- గంభీర్‌

India Vs Australia Test Series 2023- Virat Kohli: ‘‘ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారన్న విషయం గురించి నాకైతే తెలియదు. అయితే విరాట్‌ కోహ్లి మాత్రం అందరికంటే మరింత ప్రత్యేకం. భారత్‌లోనే కాదు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ లిస్టులో గనుక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బ్యాటర్లు ఉంటే వారితో కోహ్లిని పోల్చకూడదు. ఒకవేళ పోల్చాలనుకుంటే ఉపఖండ పిచ్‌లపై వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. 

కోహ్లి వన్డే ఫార్మాట్లో మాస్టర్‌.. టెస్టు క్రికెట్‌లోనూ 27 సెంచరీలు, 28 అర్ధ శతకాలు బాదాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ గడ్డపై శతకాలు సాధించాడు. ఇంతకంటే ఓ బ్యాటర్‌ సాధించాల్సి ఏముంటుంది?!’’ అంటూ టీమిండియా మాజీ బ్యాటర్‌ గౌతం గంభీర్‌... విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు.

కోహ్లి అరుదైన ఘనత..
అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లోనే 25 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం ఆషామాషీ విషయమేమీ కాదంటూ కోహ్లిని ఆకాశానికెత్తాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే.

సచిన్‌ ప్రపంచ రికార్డు బద్దలు
ఢిల్లీ మ్యాచ్‌లో మొత్తంగా 64 పరుగులు చేసిన ఈ రన్‌మెషీన్‌ కెరీర్‌లో అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 రన్స్‌ సాధించిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 577 ఇన్నింగ్స్‌లలో సచిన్‌ ఈ రికార్డు సాధించగా.. కోహ్లి 549 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దేవుడ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (588), జాక్వెస్ కలిస్ (594), కుమార సంగక్కర (608) , మహేల జయవర్ధనే(701) 25,000 పరుగులను పూర్తి చేసిన జాబితాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి రికార్డు గురించి గంభీర్‌ మాట్లాడుతూ.. కోహ్లిని ప్రశంసించాడు.

గొప్పవాడిగా ఎదుగుతావు
‘‘25 వేల పరుగులు.. ఆషామాషీ ఏం కాదు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. అయినా పట్టుదలగా ముందుకు సాగాడు. ఏ ఆటగాడికైనా.. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మార్పులు ఉంటాయి. టెక్నిక్‌ మారొచ్చు.. నీ బలాబలాలు మారొచ్చు..

నువ్వు అవుటయ్యే విధానం మారొచ్చు.. భావోద్వేగాలకు లోనుకావొచ్చు.. కానీ వీటన్నించినీ నువ్వు నియంత్రించుకోగలగాలి. నువ్వు ఆ పని చేస్తే కచ్చితంగా గొప్ప వాడిగా ఎదుగుతావు’’ అంటూ కోహ్లి ఘనతను ప్రస్తావిస్తూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.

చదవండి: Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’
ENG VS NZ: 'బజ్‌బాల్‌' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్‌ టాప్‌ వెబ్‌సైట్‌

మరిన్ని వార్తలు