Gautam Gambhir: వ్యక్తిగతంగా కాదు.. జట్టుకు భజన చేయండి; ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి ఇదే ప్రధాన కారణం 

22 Oct, 2022 12:45 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. ముక్కుసూటితత్వం ఉన్న మనిషి.తానేం చెప్పాలనుకుంటున్నాడో దానిని నిర్మొహమాటంగా బయటకు చెప్పడంలో అతనికి అతనే సాటి. టీమిండియా సాధించిన రెండు వరల్డ్‌కప్‌ల్లోనూ గంభీర్‌ పాత్ర కీలకం. ఈ రెండు టోర్నీ ఫైనల్స్‌లో గంభీర్‌ ఆడిన ఇన్నింగ్స్‌లు వేటికవే ప్రత్యేకం. 2011 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా మరొక ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి గల కారణాన్ని గంభీర తనదైన శైలిలో వివరించాడు.

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా అక్టోబర్‌ 23న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ  ఇంటర్య్వూలో గంభీర్‌ను కోహ్లి, రోహిత్‌ల గురించి తప్ప వేరే ప్రశ్న అడగలేదు. దీంతో చిర్రెత్తిన గంభీర్‌.. ముందు కోహ్లి, రోహిత్‌ భజన ఆపండి.. ఈసారి టి20 ప్రపంచకప్‌లో కీలకం కానున్న సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

'' ముందు హీరో వర్షిప్‌'' ఆపడం మంచిది. ఇండియన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడండి. టీమ్‌లోని ఆటగాళ్ల గురించి మాట్లాడితే మంచిది. కోహ్లి, రోహిత్‌లే కాదు జట్టులో మిగతావాళ్లు కూడా సభ్యులే. ఏడాది కాలంగా టి20 క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి ఒక్క ప్రశ్న అడగకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కోహ్లి, రోహిత్‌లకు పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. వాళ్లేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు. కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సూర్యకుమార్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.

సోషల్‌ మీడియాలో వాళ్లిద్దరి కంటే తక్కువ ఫాలోయింగ్‌ ఉండొచ్చు.. కానీ ఆటలో మాత్రం ప్రస్తుతం వారిని మించిపోయాడు. ఇప్పుడు కూడా కోహ్లి పేరు ముందుగా వచ్చింది. తర్వాత రోహిత్‌ శర్మ వస్తాడు.. ఆపై కేఎల్‌ రాహుల్‌. కానీ మంచి ప్రదర్శన ఆధారంగా సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యాల గురించి మాట్లాడితే మంచిది.టీమిండియా వరల్డ్‌కప్‌ ముగించిన తర్వాత ఇలాంటి హీరో వర్షిప్‌లు చేయడం ఆపేయండి.. చేయాల్సిన భజన జట్టుకు చేస్తే మంచిది. 2011 నుంచి 2022 వరకు టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి ఇదే ప్రధాన కారణం'' అంటూ పేర్కొన్నాడు.

Poll
Loading...
మరిన్ని వార్తలు