'సామ్సన్‌ తోపు .. కాదంటే చర్చకు రెడీ'

23 Sep, 2020 17:59 IST|Sakshi

దుబాయ్‌ : ఎప్పుడు ఏదో ఒక వార్తతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంబీర్‌ తాజాగా సంజూ సామ్సన్‌ ప్రదర్శనపై స్పందించాడు. సంజూ సామ్సన్‌ మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాడని.. కాదని ఎవరైనా అంటే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నాడు. చైన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం షార్జాలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ సామ్సన్‌ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (చదవండి : 'రసెల్‌ కంటే శుభమన్‌ కీలకం కానున్నాడు')

సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన శామ్సన్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌కు మంచి ఊపునిచ్చాడు. శామ్సన్‌ దాటికి లీగ్‌లో తొలిసారి 200 పరుగుల స్కోరు దాటింది. ఈ అద్భుత ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు, కోల్‌కతా మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంబీర్‌ శామ్సన్‌ను ట్విటర్‌ ద్వారా ప్రశంసలతో ముంచెత్తాడు. ' సంజూ సామ్సన్‌ కేవలం బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ మాత్రమే కాదు.. ఇండియాలో ఉన్న యంగ్‌ టాలంటెడ్‌ ప్లేయర్స్‌లో ఒకడు. ఈ విషయంలో ఎవరు కాదని చర్చకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నా అంటూ ట్వీట్‌ చేశాడు. 

అంతకముందు సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే వ్యూహాలతో జట్టును ఎలా నడిపిస్తాడని గంభీర్‌ సందేహం వెలిబుచ్చాడు. ఇదే పని మరో కెప్టెన్‌ చేసి ఉంటే క్రికెట్‌ అభిమానులు తీవ్ర విమర్శలు చేసేవారని, ధోని అవడం వల్ల అంతా సైలెంట్‌ అయిపోయారంటూ పేర్కొన్నాడు. అయితే తాను క్వారంటైన్‌లో ఎక్కువ రోజులు గడపడం వల్లే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్నట్లు ధోని పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి : కేన్‌ విలియమ్సన్‌ అందుకే ఆడలేదా..)

ఇక మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సామ్సన్‌ తాను ఎదుర్కొన్న ఐదో బంతితో విధ్వంసం మొదలు పెట్టాడు. స్యామ్‌ కరన్‌ వేసిన ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన అతను జడేజా ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక చావ్లా వేసిన ఓవర్లోనైతే అతను పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టిన సామ్సన్‌ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు తగ్గించకుండా ఆడిన అతను మరో రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. చివరకు ఇన్‌గిడి బౌలింగ్‌లో ఇదే తరహా షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చహర్‌కు చిక్కడంతో సామ్సన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సామ్సన్‌ 58 పరుగులు బౌండరీల రూపంలోనే సాధించడం విశేషం.  

మరిన్ని వార్తలు