గంగూలీ బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్‌.. హీరోగా చాక్లెట్‌ బాయ్‌

13 Jul, 2021 15:51 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దమైంది. గత కొన్నేళ్లుగా బయోపిక్‌కు ససేమిరా అంటున్న దాదా.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు. తన బయోపిక్‌ తెరకెక్కించేందుకు తనవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తున్నారని ప్రకటించాడు. ప్రస్తుతానికి ఈ బయోపిక్‌ హిందీలో మాత్రమే తెరకెక్కబోతుందని వెల్లడించిన దాదా.. లీడ్‌ రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్‌ బాయ్‌ రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నాడని స్వయంగా వెల్లడించాడు. 

ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా తన బయోపిక్‌కు సంబంధించిన విశేషాలను ప్రస్తావించాడు. హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన దాదా, డైరెక్టర్‌ ఎవరన్నది ఇప్పుడే చెప్పలేనని మాట దాటవేశాడు. బయోపిక్‌కు సంబంధించిన విశేషాలపై అధికారిక ప్రకటన రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపాడు. కాగా, బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం దాదా బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ పలుమార్లు దాదాతో సంప్రదింపులు జరిపి మరీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఒప్పించిందని సమాచారం. 

ఈ బయోపిక్‌లో యువ క్రికెటర్‌గా దాదా ప్రస్తానం, లార్డ్స్‌లో అతను సాధించిన చారిత్రక విజయంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేవరకు దాదా జీవితంలో అన్నీ కోణాలు చూపిస్తారని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో మాజీ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం, బ్రేకప్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు