ఐపీఎల్‌ పదవిని తిరస్కరించిన గంగూలీ.. తన స్థాయికి చిన్నది అంటూ..!

11 Oct, 2022 20:46 IST|Sakshi

బీసీసీఐ తాజా మాజీ బాస్‌ సౌరవ్‌ గంగూలీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోసారి బీసీసీఐ పగ్గాలు చేపడదామని ఆశించి భంగపడ్డ దాదాకు బోర్డు సభ్యులు ఓ టెంప్టింగ్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దాదా ఆ ఆఫర్‌ను చాలా లైట్‌గా తీసుకుని తిరస్కరించాడని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా టెంప్టింగ్‌ ఆఫర్‌ అంటే.. ఇవాళ జరిగిన బోర్డు ముఖ్య సమావేశంలో సభ్యులంతా గంగూలీని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చైర్మన్‌గా ఉండాలని కోరారట. 

అయితే ఇది చిన్న పదవిగా భావించిన గంగూ భాయ్‌.. సబ్‌ కమిటీ​కి నేను హెడ్‌గా ఉండటమేంటని ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న అరుణ్‌ ధుమాల్‌కు ఆ పదవి ఇవ్వాలని బోర్డు సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చారట. అలాగే గంగూలీని బీసీసీఐ తరఫున ఐసీసీ చైర్మన్‌ పదవికి  నామినేట్‌ చేయాలని నిర్ణయించారట. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ముఖ్య అధికారి ఒకరు ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఇవాళ ముంబైలో జరిగిన బీసీసీఐ ఏజీఎంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్‌ చైర్మన్‌ పదవుల ఎన్నికపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయని సమాచారం. అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా, కార్యదర్శిగా జై షా, ఐపీఎల్‌ చైర్మన్‌గా బ్రిజేష్‌ పటేల్‌ స్థానంలో అరుణ్‌ ధుమాల్‌ అభ్యర్ధిత్వాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 18న జరుగబోయే బీసీసీఐ ఏజీఎంలో వీరందరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

>
మరిన్ని వార్తలు