గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

14 Oct, 2022 10:47 IST|Sakshi

టీమిండియా మాజీలు రవిశాస్త్రి, సౌరవ్‌ గంగూలీ.. ఒకరంటే ఒకరికి పడదన్న విషయం బహిర్గతమే. ఇద్దరి మధ్య ఎప్పటినుంచో కోల్డ్‌వార్‌ సాగుతూనే ఉంది. ఒక సందర్భంలో తనకంటే జూనియర్‌ అయిన సౌరవ్‌ గంగూలీ ముందు టీమిండియా హెడ్ కోచ్గా ఇంటర్వ్యూకు వెళ్లడానికి తనకు మనసొప్పలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేగాక గంగూలీ అధ్యక్షుడిగా బీసీసీఐ తీసుకొచ్చిన కొన్ని పాలనాపరమైన  నిర్ణయాలను కూడా శాస్త్రి బాహటంగానే విమర్శించేవాడు.

తాజాగా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ రావడంపై రవిశాస్త్రి స్పందించాడు. రోజర్‌ బిన్నిని ప్రశంసిస్తూనే గంగూలీకి పరోక్షంగా చురకలంటించాడు. జీవితంలో ఏది శాశ్వతం కాదు.. కొన్ని పనులు మాత్రమే చేయగలరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''బీసీసీఐ అధ్యక్షుడి రేసులో  రోజర్ బిన్నీ పేరు ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను అతడితో కలిసి ఆడాను.1983 వన్డే ప్రపంచకప్ బిన్నీ నా సహచర ఆటగాడు.కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు బీసీసీఐకి వస్తున్నాడు ఒక ప్రపంచకప్ విన్నింగ్ జట్టులోని సభ్యుడు  బీసీసీఐ అధ్యక్షుడవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి  బీసీసీఐ అధ్యక్ష పదవిలో  ప్రపంచకప్  విజేత కూర్చోనుండటం ఇదే తొలిసారి.

బిన్నీ రాకతో అయినా దేశవాళీ క్రికెట్ లో వసతులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే బిన్నీ కూడా ఒక క్రికెటరే. అతడు కచ్చితంగా  బోర్డులో ఇతర వ్యవహారాల కంటే క్రికెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడని నేను భావిస్తున్నా. కింది స్థాయిలో గ్రౌండ్స్ లో  వసతులు సరిగా లేవు. కొత్త పాలకవర్గం దాని మీద దృష్టి సారించాలి. నేను చదివిన ప్రకారం బీసీసీఐకి ఎవరూ రెండోసారి అధ్యక్షుడు కాలేదు. ఈ రకంగా చూస్తే ఒకరు రావాలంటే ప్రస్తుతం ఉన్నవారు పదవి నుంచి తప్పుకోవాల్సిందే. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. అన్ని చేయాలనుకున్నప్పటికీ చివరికి కొన్ని పనులు మాత్రమే చేయగలరు.'' అని తెలిపాడు. 

రవిశాస్త్రి కామెంట్స్‌ విన్న అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఒక రకంగా రవిశాస్త్రికి ఇది సంతోషకరమైన విషయం కావొచ్చు.. బిన్నీని పొగడుతూనే దాదాకు చురకలంటించాడు. అంటూ పేర్కొన్నాడు. ఇక దాదా అభిమానులు మాత్రం​.. ''ఎప్పుడో జరిగిన దానిని మనసులో పెట్టుకొని కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.'' అని చురకలంటించారు.

చదవండి: జర్నలిస్టు తిక్క ప్రశ్న.. బాబర్‌ ఆజం దిమ్మతిరిగే కౌంటర్‌

బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ

మరిన్ని వార్తలు