Gary Ballance: చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్‌.. అత్యంత అరుదైన ఘనత సొంతం

5 Feb, 2023 15:33 IST|Sakshi

జింబాబ్వే క్రికెటర్‌ గ్యారీ బాలెన్స్‌ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్‌, జింబాబ్వే) తరఫున టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన 16వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్‌ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్‌) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్‌ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి.

రెండు దేశాల తరఫున టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్‌ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్‌ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్‌ తరఫున క్రికెట్‌ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్‌.. ఆ క్రమంలో  కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్‌.. ఆతర్వాత ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. 

వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌ ద్వారా బ్యాలెన్స్‌ జింబాబ్వే తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్‌ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ టీమ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్‌ చంద్రపాల్‌ (55), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. 

రెండు దేశాల తరఫున  టెస్టులు ఆడిన క్రికెటర్లు.. 

  • బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) 
  • విలియమ్ లాయిడ్ ముర్డాక్‌ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) 
  • జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్)
  • సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) 
  • ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) 
  • అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) 
  • ఫ్రాంక్‌ మిచెల్‌ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా)
  • ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) 
  • గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్)
  • అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) 
  • అమీర్‌ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) 
  • సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) 
  • జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే)
  • కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) 
  • బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) 
  • గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే)  
>
మరిన్ని వార్తలు