Gary Kirsten: పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్‌!

28 Oct, 2021 12:08 IST|Sakshi

This Former Cricketer To Replace Misbah-ul-Haq: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు అదరగొడుతోంది. టీమిండియా, న్యూజిలాండ్‌ వంటి మేటి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీస్‌కు చేరువవుతోంది. తద్వారా క్రీడా విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ ఈవెంట్‌ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

హెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ సహా బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సందిగ్దంలో పడింది. సక్లెయిన్‌ ముస్తాక్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది. అయితే... విదేశీ కోచ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా భావిస్తున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అతడితో పాటు సైమన్‌ కటిచ్(ఆస్ట్రేలియా)‌, పీటర్‌ మూర్స్‌(ఇంగ్లండ్‌) పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. 

మూడేళ్లపాటు
గ్యారీ కిర్‌స్టన్‌ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి నిర్దేశనంలో.. ఎంఎస్‌ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్‌స్టన్‌ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్‌లోనూ నంబర్‌ 1 ర్యాంకుకు చేరుకుంది.

క్రికెటర్‌గా కిర్‌స్టన్‌ గణాంకాలు
దక్షిణాఫ్రికా తరఫున గ్యారీ కిర్‌స్టన్‌.. 185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7289, వన్డేల్లో 6798 పరుగులు చేశాడు. 2004లో ప్రొటిస్‌ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడాడు. 

చదవండి: T20 World Cup 2021: నెట్స్‌లో శ్రమిస్తున్న పాండ్యా.. శార్దూల్‌, భువీతో కలిసి బౌలింగ్‌ చేస్తూ..


T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే..

Poll
Loading...
మరిన్ని వార్తలు