T20 WC 2022: 'బాబర్‌ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే'

1 Nov, 2022 12:12 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌ ఎట్టకేలకు ఒక విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు వరుస ఓటముల తర్వాత.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ గెలుపు రుచి చూసింది. ముఖ్యంగా జింబ్వాబ్వే చేతిలో ఓటమి తర్వాత.. పాకిస్తాన్‌ జట్టుపై విమర్శల వర్షం కురిసింది. జట్టుతో పాటు కెప్టెన్‌ బాబర్‌ అజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు.

ఇక తాజాగా భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ కూడా బాబర్‌ అజంపై కీలక వాఖ్యలు చేశాడు. బాబర్‌ జట్టు కోసం తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేసి ఉండాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.  కాగా ఈ మెగా ఈవెంట్‌లో బాబర్‌ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

భారత్‌తో మ్యాచ్‌లో అయితే ఏకంగా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. "బాబర్‌ తన కోసం కాకుండా జట్టు కోసం ఆలోచిస్తే బాగుంటుంది. ఓపెనర్‌గా అతడు దారుణంగా విఫలమవుతున్నప్పుడు.. ఆ స్థానంలో ఫఖర్ జమాన్‌ను అవకాశం ఇవ్వాలి కదా?. దీనినే స్వార్థం అంటారు. కెప్టెన్‌గా ఎప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచించకూడదు.

బాబర్‌, రిజ్వాన్‌ ఓపెనర్లుగా ఎన్నో రికార్డులు సృష్టించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జట్టుకు ఏది అవసరమో గ్రహించి  సరైన నిర్ణయం తీసుకునే వాడే నిజమైన లీడర్‌. ఇప్పటికైనా మీ రికార్డులు గురించి కాకుండా జట్టు కోసం ఆలోచించండి" అని పేర్కొన్నాడు. ఇక  ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ దాదాపు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఇక పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియాలో మూడు మార్పులు!

>
మరిన్ని వార్తలు