గౌతమ్‌ గంభీర్‌కు మరిన్ని కీలక బాధ్యతలు

7 Oct, 2022 19:22 IST|Sakshi

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యాజమాన్యం మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా యజమానిగా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ ఆధీనంలో ఉన్న అన్ని సూపర్‌ జెయింట్స్‌ జట్లకు గంభీర్‌ను గ్లోబల్‌ మెంటార్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

ప్రస్తుతం ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీతో (ఐపీఎల్‌) పాటు డర్బన్‌ ఫ్రాంచైజీ (సౌతాఫ్రికా టీ20 లీగ్‌) కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్పీఎస్జీ గ్రూప్ తాజా నిర్ణయంతో గంభీర్‌కు ఎల్‌ఎస్‌జీ మెంటార్షిప్‌తో పాటు డర్బన్‌ ఫ్రాంచైజీ మెంటార్షిప్‌ కూడా దక్కనుంది. గడిచిన ఐపీఎల్‌ సీజన్‌లో గంభీర్‌ పనితనాన్ని మెచ్చి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించినట్లు ఆర్పీఎస్జీ గ్రూప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ప్రస్తుత తరంలో చురుకైన క్రికెటింగ్‌ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్లో గంభీర్‌ ముఖ్యుడని ఆర్పీఎస్జీ పేర్కొంది. కాగా, గంభీర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గడిచిన ఐపీఎల్‌లో అంచనాలకు మించి రాణించిన విషయం తెలిసిందే. కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో ఏ మాత్రం అంచనాలు లేని ఎల్‌ఎస్‌జీని గంభీర్‌ అన్నీ తానై ముందుండి నడిపించాడు. యువ ఆటగాళ్లను సానబెట్టడంలో గంభీర్‌ సక్సెస్‌ కావడంతో ఎల్‌ఎస్‌జీ గత సీజన్‌లో టాప్‌-4లో నిలిచింది.

ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలోని డర్బన్‌ ఫ్రాంచైజీ వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా  జరుగబోయే ఎస్‌ఏ20 లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక్కడ పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్‌ యాజమాన్యలే చేజిక్కించుకోవడంతో ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల ముగిసిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో గంభీర్‌ ఇండియా క్యాపిటల్స్‌ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు