భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్‌ గంభీర్‌

8 Aug, 2021 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ: 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా విశ్వక్రీడల వేదికపై స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే తన బల్లెంను అందరికంటే ఎక్కువ (87.58 మీటర్ల) దూరం విసిరి అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి సామాన్యుడి వరకు నీరజ్ చోప్రాకు నీరజనాలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారత క్రికెట్ జట్టు గెలిచిన 2011 ప్రపంచ కప్ కన్నా గొప్పదని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీటర్ వేదికగా స్పందించాడు. భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు..ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పటికీ చేయకూడదంటూ ట్వీట్ చేశాడు. అయితే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవలే 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయం పట్ల కూడా యావత్ భారతం హర్షించింది. హాకీ టీమ్‌ను కొనియాడింది.

ఈ క్రమంలోనే గంభీర్ కూడా భారత హాకీ జట్టును కొనియాడుతూ.. 2011 వన్డే ప్రపంచకప్ విజయం కన్నా ఒలింపిక్స్‌లో హాకీ జట్టు సాధించిన కాంస్యమే ఎక్కువని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. నెటిజన్లు గంభీర్‌‌ను ట్రోల్‌ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో భజ్జీ కూడా ఒలింపిక్స్‌ పతకాన్ని క్రికెట్‌ వరల్డ్‌కప్‌తో పోలుస్తూ అదే తరహా కామెంట్స్ చేయడంతో గంభీర్ ముందు జాగ్రత్తగా మనం అలా చెప్పకూడదని పేర్కొన్నాడు. ఇక 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. 

మరిన్ని వార్తలు