WTC Final: కేఎస్‌ భరత్‌ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?!

15 Mar, 2023 13:07 IST|Sakshi

WTC Final 2023- India Vs Australia: స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ కంగారూ జట్టును ఢీకొట్టబోతోంది. డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌ తుదిపోరులో ఇంగ్లండ్‌ గడ్డ మీద ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7- 11 వరకు ఇరు జట్ల మ్యాచ్‌కు ఇప్పటికే ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కమిన్స్‌ బృందంతో తలపడే భారత జట్టుపై అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

అదరగొట్టిన గిల్‌
తొలి టెస్టులో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌ను ఢిల్లీ మ్యాచ్‌లోనూ కొనసాగించడంతో సెలక్టర్ల తీరుపై విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో మూడో టెస్టులో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్థానంలో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ జట్టులోకి వచ్చాడు. ఇండోర్‌ టెస్టులో పెద్దగా రాణించనప్పటికీ ఆఖరిదైన నిర్ణయాత్మక అహ్మదాబాద్‌ టెస్టులో శతకంతో చెలరేగాడు.

విలువైన 44 పరుగులు
గిల్‌, విరాట్‌ కోహ్లి అద్భుత సెంచరీల కారణంగా చివరి టెస్టును డ్రా చేసుకున్న రోహిత్‌ సేన ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌.. ఆరంభంలో ఆకట్టుకోలేకపోయినా.. చివరి టెస్టులో 44 విలువైన పరుగులు చేసి డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా గిల్‌, వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని.. డబ్ల్యూటీసీ ఫైనల్లో వీరిని కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సునిల్‌ గావస్కర్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌ పేరును తెరమీదకు తెచ్చాడు.

భరత్‌ వద్దు.. అతడే సరైనోడు
‘‘ఫైనల్లో రాహుల్‌ను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఆడించవచ్చు. ఓవల్‌లో ఐదు లేదంటే ఆరో స్థానంలో అతడిని ఆడిస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత పటిష్టమవుతుంది. గతేడాది ఇంగ్లండ్‌లో రాహుల్‌ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే ఈ మాట అంటున్నాను.

లార్డ్స్‌లో అతడు సెంచరీ సాధించాడు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టును ఎంపిక చేసేటపుడు తప్పకుండా రాహుల్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలి’’ అని గావస్కర్‌ స్పోర్ట్స్‌తక్‌తో వ్యాఖ్యానించాడు. 

ఎందుకు సర్‌ ఇలా అంటున్నారు?
ఇక కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవాలన్న గావస్కర్‌.. ‘‘ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌ తుది జట్టులో కేఎస్‌ భరత్‌ ఉంటాడా లేదా అన్నది పూర్తిగా సెలక్షన్‌ కమిటీ నిర్ణయం. అయితే, నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్‌ పిచ్‌లపై వికెట్‌ కీపింగ్‌ చేయాలంటే కేఎల్‌ రాహుల్‌ వంటి అనుభవజ్ఞులు అవసరం.

లేదంటే ఇషాన్‌ కిషన్‌ పేరును కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే భరత్‌ కంటే అతడు మెరుగ్గా బ్యాటింగ్‌ చేయగలడు’’ అని పేర్కొన్నాడు. దీంతో గావస్కర్‌ మాటలపై కొంతమంది నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ వంటి కీలక మ్యాచ్‌లో.. టెస్టుల్లో అరంగేట్రం చేయని ఇషాన్‌ను ఆడించాలి..

చాన్నాళ్లుగా విఫలమవుతున్న రాహుల్‌ను ఎంపిక చేయాలి.. కానీ తనను తాను నిరూపించుకుంటున్న భరత్‌ను మాత్రం పక్కనపెట్టాలా?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ వివక్ష ఎందుకో అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ​ పంత్‌ గతేడాది యాక్సిడెంట్‌కు గురైన కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో భరత్‌ బీజీటీ-2023 ద్వారా అరంగేట్రం చేశాడు.

చదవండి: ఖరీదైన 6 బెడ్‌ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్‌.. ధర ఎంతో తెలుసా..?
విలియమ్సన్, సౌతీలకు ఊరట.. ఐపీఎల్‌ కోసం..!

మరిన్ని వార్తలు