ఆర్సీబీ.. మీకు అతనే పర్ఫెక్ట్‌ ఫినిషర్‌!

8 Nov, 2020 18:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో టాలెంట్‌ ఉన్న కొంతమంది ఆటగాళ్లను సరైన స్థానంలో ఆడించలేదని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కన్ఫూజ్‌ ఏర్పడిన కారణంగా శివం దూబే వంటి ఆల్‌రౌండర్‌కు సరైన న్యాయం జరగలేదన్నాడు. దూబేను ఆడమని ప్రోత్సహించి ఉంటే ఫలితం మరొకలా ఉండేదన్నాడు. దూబేను వాషింగ్టన్‌ సుందర్‌ కంటే కింది స్థానంలో పంపడంతో అతను కన్ఫ్యూజ్‌ అవుతూ వచ్చాడన్నాడు. దూబేను ఆర్సీబీ పర్ఫెక్ట్‌ ఫినిషర్‌తో పోల్చాడు గావస్కర్‌. స్టార్‌ స్పోర్ట్‌తో మాట్లాడిన గావస్కర్‌.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు ఎంతో సమయం లేకపోవడంతో ఇకనైనా ఆర్సీబీ ఫినిషర్‌పై గురిపెట్టాలన్నాడు. ఆర్సీబీకి దూబే పర్ఫెక్ట్‌ ఫినిషర్‌ కాగలడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక్కడ దూబేకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఇస్తే మంచిదని సూచించాడు. (‘ప్రతీసారి జట్టును మార్చలేరు’)

‘దూబేకు ఒక కచ్చితమైన రోల్‌ను అప్పగించడంపై ఆలోచన చేస్తే మంచింది. దూబే చాలా కింది వరుసలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇక సుందర్‌ ఏమో కిందికి పైకి ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాడు. అతనికి ఒక రోల్‌ను అప్పచెప్పి, బంతిని హిట్‌ చేయమనే ఫ్రీహ్యాండ్‌ ఇవ్వండి. అది అతనికి లాభించే అవకాశం ఉంది.  ప్రస్తుతం అతను కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఐదో స్థానంలో దూబేను బ్యాటింగ్‌కు పంపడమే కాకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పండి. అప్పుడు కోహ్లి, డివిలియర్స్‌లపై ఒత్తిడి తగ్గుతుంది. దూబే ఉన్నతమైన లక్ష్యాలను సెట్‌ చేసుకున్నా దానిని అందిపుచ్చుకోవడం లేదు. దూబే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పదే పదే మార్చడమే కారణం. డివిలియర్స్‌తో పాటు దూబే కూడా పరుగులు చేస్తే ఆర్సీబీ పెద్ద స్కోరును బోర్డుపై ఉంచకల్గుతుంది’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు