Dinesh Karthik:'వయసుతో పనేంటి.. టి20 వరల్డ్‌కప్‌లో మంచి ఫినిషర్‌ అవడం ఖాయం'

19 Apr, 2022 17:45 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తిక్‌  జట్టుకు మంచి ఫినిషర్‌గా మారాడు. ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు నాటౌట్‌గా నిలిచిన కార్తిక్‌ వరుసగా 32*,14*,44*,7,34*,66* పరుగులు సాధించాడు.  ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌ వస్తూ 197 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం అంటే మాములు విషయం కాదు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 66 పరుగులు చేసి ఆర్‌సీబీ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో 16 పరుగులతో గెలిచింది.కాగా 36 ఏళ్ల వయసులో దూకుడైన ఆటతీరు కనబరుస్తున్న దినేశ్‌ కార్తిక్‌పై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. రానున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియాలో కార్తిక్‌ చోటు దక్కించుకోవడం ఖాయమని.. మంచి ఫినిషర్‌గా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. స్టార్‌స్పోర్ట్‌కు ఇచ్చి ఇంటర్య్వూలో గావస్కర్‌ మాట్లాడాడు.

''టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కార్తిక్‌ ఇటీవలే తన మనసులోని మాటను బయటపెట్టాడు. అతని కోరిక కచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు వయసు ముఖ్యం కాదు.. ఫిట్‌నెస్‌ ఎలా ఉంది.. ఆటతీరు ఎలా ఉంది చూడడమే ప్రధాన అంశం. ఎందుకంటే టి20 క్రికెట్‌లో ఈ రెండు ఇప్పుడు కొలమానాలుగా మారిపోయాయి. ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే వయసుతో సంబంధం లేకుండా జట్టులోకి ఎంపికయిపోవచ్చు. అలా కార్తిక్‌ రానున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టుకు ఎంపికవుతాడు. ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌ వచ్చే అవకాశమున్న కార్తిక్‌ మంచి ఫినిషర్‌గా మారడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. 

ఇక దినేశ్‌ కార్తిక్‌.. ధోని కంటే ముందు జట్టులోకి వచ్చినప్పటికి అతని నీడలో పెద్దగా ఆడలేకపోయాడు. టీమిండియా తరపున కార్తిక్‌ 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ దినేశ్‌ కార్తిక్‌కు చివరి వన్డే కావడం విశేషం. 
 

మరిన్ని వార్తలు