IND vs SL: 'ఇషాన్ కిషన్ బాగా ఆడాడు.. కానీ ఇది సరిపోదు'

25 Feb, 2022 22:20 IST|Sakshi

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. అదే విధంగా దోని, పంత్‌కు సాధ్యం కాని రికార్డును కిషన్‌ సాధించాడు. 89 పరుగులు చేసిన కిషన్‌.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన తొలి భారత భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. టీ20ల్లో కిషన్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికి నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

"ఈ మ్యాచ్‌లో కిషన్‌ అ‍ద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే ఇది మొదటి మ్యాచ్‌ మాత్రమే. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడు అంతగా రాణించలేదు. ఈడెన్‌లో పేస్‌ బౌలింగ్‌కు కిషన్‌ ఇబ్బంది పడ్డాడు. లక్నోలో పిచ్‌ బ్యాటర్లకు అనూకూలించింది. కానీ కిషన్‌ ఆడిన డ్రైవ్‌, పుల్ షాట్లు అద్భుతమైనవి. అయితే ముఖ్యంగా అతడి బ్యాటింగ్‌లో నిలకడ కావాలి. అతడు నిలకడగా ప్రదర్శన చేస్తే కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడు వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగలడు. అదే విధంగా అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్‌ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.

చదవండి: IND vs SL: 'కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు'

మరిన్ని వార్తలు