ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్‌

19 Oct, 2020 19:52 IST|Sakshi

దుబాయ్‌:  ముంబై ఇండియన్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు పడ్డాయి. ముందు జరిగిన సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలి సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్‌ ఆడించారు. ఆ సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్‌ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్‌ ఛేదించింది.  మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్‌  వేసిన తొలి బంతిని గేల్‌ సిక్స్‌ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్‌ ఫోర్‌ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇలా ఐపీఎల్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్లు పడటం ఇదే తొలిసారి. (ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది)

కాగా,  సెకండ్ సూపర్ ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకొచ్చినందుకు ఆగ్రహంతోపాటు కలత చెందానని యూనివర్శల్‌ బాస్‌ గేల్ తెలిపాడు. ఆ సమయంలో తానేమీ ఆందోళనకు చెందలేదని, క్రికెట్‌లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నాడు. కాకపోతే రెండో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు ‘తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం?’ అని మయాంక్ అడిగిన ప్రశ్నకు గేల్ బాగా కలత చెందాడట. కోపం కూడా వచ్చిందని గేల్‌ తెలిపాడు. మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా..? , ఫస్ట్ బాల్‌ను బాస్ ఎదుర్కొంటాడు అని సమాధానం ఇచ్చాడట. మ్యాచ్‌ తర్వాత ఆటగాళ్లతో ఇంటరాక్షన్‌లో సూపర్‌ ఓవర్ల గురించి గేల్‌ మాట్లాడాడు. ఈ క్రమంలోనే  మయాంక్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లేటప్పుడు సంభాషణను వెల్లడించాడు.  మరొకవైపు షమీపై ప్రశంసలు కురిపించాడు గేల్‌. ‘నా వరకు షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రోహిత్, డికాక్‌లకు బౌలింగ్ చేసిన షమీ.. ఆరు పరుగులు కూడా చేయకుండా సమర్థవంతంగా వ్యవహరించాడు. షమీ వేసి యార్కర్లను నేను నెట్స్‌లో ఎదుర్కొన్నాను. ప్రత్యర్థులకు కూడా షమీ యార్కర్లను రుచి చూపిస్తాడని తెలుసు. నేను అనుకున్నట్టే షమీ బౌలింగ్ చేశాడు’ అని గేల్‌ కొనియాడాడు.

మరిన్ని వార్తలు