Chris Gayle: టీ20ల్లో 14 వేల పరుగులు; ఐదేళ్ల తర్వాత హాఫ్‌ సెంచరీ

13 Jul, 2021 10:10 IST|Sakshi

సెంట్‌ లూసియా: యునివర్సల్‌ బాస్‌.. హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో మెరవడంతో వెస్టిండీస్‌ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను విండీస్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌ విషయానికి వస్తే 142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. గేల్‌(38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడడంతో పాటు కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) సహకరించాడు. దీంతో విండీస్‌ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో హెన్రిక్స్‌ 33, కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 30 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ 3, ఆండీ రసెల్‌ 2 వికెట్లు తీశారు. ఇక గేల్‌ ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్‌ చరిత్ర సృష్టించాడు.

ఇక విండీస్‌ తరపున ఐదేళ్ల తర్వాత హాఫ్‌ సెంచరీ సాధించిన గేల్‌ అదే జోష్‌లో విండీస్‌కు సిరీస్‌ను అందించాడు. కాగా మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో గేల్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అర్థసెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. సిరీస్‌లో నామమాత్రంగా మారిన మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 14, 16న జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు