2022 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జర్మనీ..

13 Oct, 2021 11:56 IST|Sakshi

బెర్లిన్‌: కొత్త కోచ్‌ హాన్సీ ఫ్లిక్‌ ఆధ్వర్యంలో జర్మనీ ఫుట్‌బాల్‌ జట్టు తొలి లక్ష్యం సాధించింది. వచ్చే ఏడాది ఖతర్‌లో జరిగే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్‌ జట్టుకు నేరుగా అర్హత కల్పించారు. యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా గ్రూప్‌ ‘జె’ లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీ 4–0తో నార్త్‌ మెసిడోనియా జట్టుపై నెగ్గింది. జర్మనీ తరఫున వెర్నర్‌ (70వ, 73వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... హావెట్జ్‌ (50వ ని.లో), జమాల్‌ (83వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. యూరోపియన్‌ జోన్‌ నుంచి మొత్తం 13 బెర్త్‌లు ఉండగా గతంలో నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ మొదటి బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఆరు జట్లున్న గ్రూప్‌ ‘జె’లో ఎనిమిది లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జర్మనీ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోరీ్నలో తమకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే జర్మనీ మెగా ఈవెంట్‌కు బెర్త్‌ దక్కించుకోవడం విశేషం. 2014లో నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ 2018లో మాత్రం లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2022 ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు బరిలోకి దిగుతాయి. ఇప్పటికే ఖతర్, జర్మనీ అర్హత పొందగా... వచ్చే ఏడాది జూన్‌లో ముగిసే క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా మరో 30 జట్లు అర్హత సాధిస్తాయి.

చదవండి: IPL 2021 Qualifier 2: మమ్మల్ని ఎవరైనా తేలికగా తీసుకుంటారా?

మరిన్ని వార్తలు