టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్‌ ఫుట్‌బాలర్‌ సజీవంగా..

7 Feb, 2023 16:30 IST|Sakshi

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తాజా సమాచారం ప్రకారం.. 4800కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్‌లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేలాది మంది ఇంకా శిథిలాలే కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఘనా స్టార్‌ ఫుట్‌బాల్‌ క్రిస్టియన్‌ అట్సు ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రస్తుతం అతను టర్కీష్‌ సూపర్‌ క్లబ్‌ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్‌ అట్సు సదరన్‌ ప్రావిన్స్‌ ఆఫ్‌ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. అయితే దేవుని దయవల్ల అతనికి ఏం జరగలేదు. రెస్క్యూ టీమ్‌ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఇదే విషయాన్ని ఘనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్‌ స్టేషన్‌ మార్నింగ్‌ బులెటిన్‌లో వెల్లడించింది. ''మీకొక గుడ్‌న్యూస్‌. మాకు అందిన సమాచారం ప్రకారం ఘనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియన్‌ అట్సూ ప్రాణాలతో బయటపడ్డాడు. భూకంపం సంభవించిన టర్కీలోని సదరన్‌ ప్రావిన్స్‌ ఆఫ్‌ హటేలో అతను ఉంటున్న బిల్డింగ్‌ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని రక్షించారు.'' అంటూ పోస్ట్‌ చేసింది.

ఇక అట్సు చెల్సియా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్‌కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్‌ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్‌ చేశాడు.

చదవండి: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు

మరిన్ని వార్తలు