Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

18 Feb, 2023 18:10 IST|Sakshi

ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. టర్కీలో సంభవించిన భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ఘనా ఫుట్‌బాలర్‌ క్రిస్టియన్‌ అట్సూ 11 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం(ఫిబ్రవరి 18న) కన్నుమూశాడు. క్రిస్టియన్‌ అట్సూ మృతిని ఘనా ఫుట్‌బాల్‌ అధికారికంగా ప్రకటించింది. ''ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మృత్యువుతో పోరాడి అలసిపోయిన క్రిస్టియన్‌ అట్సూ ఇవాళ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి.'' అంటూ నానా సెక్కెర్‌ ట్వీట్‌ చేశారు.

ఇక టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఇప్పటికే మృతుల సంఖ్య 20వేలు దాటింది.  ప్రస్తుతం అతను టర్కీష్‌ సూపర్‌ క్లబ్‌ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్‌ అట్సు సదరన్‌ ప్రావిన్స్‌ ఆఫ్‌ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు.

ఫిబ్రవరి 7న రెస్క్యూ టీమ్‌ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అట్సూకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి చనిపోయినట్లు వైద్యలు దృవీకరించారు.  అట్సు చెల్సియా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్‌కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్‌ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్‌ చేశాడు.

మరిన్ని వార్తలు