క్రికెట్‌ చరిత్రలో వింత ఘటన.. దెయ్యమే అలా చేసిందంటున్న నెటిజన్లు

26 Jul, 2021 17:54 IST|Sakshi

హరారే: క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. బ్యాట్స్‌మెన్లు ఊహించని రీతిలో పెవిలియన్‌కు చేరడం, ఫీల్డర్లు నమ్మశక్యంకాని రీతిలో రనౌట్లు, క్యాచ్‌లు పట్టడం వంటివి గమినిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ ఘటన బహుశా క్రికెట్‌ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇటీవ‌ల హరారే వేదికగా రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లోని 18వ ఓవ‌ర్‌లో మ‌హ‌మ్మ‌ద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా ఐదో బంతి వేయకముందే.. వికెట్ల మీద ఉన్న బెయిల్స్ వాటంత‌ట అవే ప‌డిపోయాయి. ఇది గమనించని బ్యాట్స్‌మన్ వెనక్కి జరిగి పుల్ షాట్ ఆడాడు. ఆపై వెనక్కి తిరిగి చూసుకోగా.. బెయిల్స్ పోడిపోయి ఉన్నాయి. దీంతో సైఫుద్దీన్ షాక్ అయ్యాడు. తాను కాని బాల్ కాని వికెట్లుకు తగల్లేదు కదా.. బెయిల్స్ ఎలా పడిపోయాయని ఆశ్చర్యపోయాడు. ఫీల్డ్ అంపైర్లు స్ప‌ష్ట‌త కోసం థ‌ర్డ్ అంపైర్‌ను సంప్రదించగా.. రీప్లేల్లో బ్యాట్స్‌మ‌న్ స్టంప్స్‌కు త‌గ‌ల్లేద‌ని స్పష్టంగా తేలింది. దీంతో బెయిల్స్ ఎందుకు ప‌డిపోయాయో అర్థం కాలేదు. గాలి కార‌ణంగా బెయిల్ కింద ప‌డింద‌ని అనుకున్నా.. స్టంప్ ఎలా క‌దిలిందో మాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలో గాలి ఛాయలు కూడా లేకపోవడం ఆటగాళ్లతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ మిస్ట‌రీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి ర‌క ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. దెయ్యం వికెట్ తీసింద‌ని, క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా దెయ్యం తీసిన వికెట్ ఇదేన‌ని చిత్రవిచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాతో జరిగిన ఈ సిరీస్‌ మొత్తంలో జింబాబ్వే ఇదొక్క మ్యాచ్‌ మాత్రమే నెగ్గడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లా జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో గెలిచింది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లోనూ, అలాగే మూడు వన్డేల్లోనూ బంగ్లానే గెలుపొందింది. 

మరిన్ని వార్తలు